కూటమి అధికారంలోకి వచ్చాక చెత్తపై పన్ను రద్దు : చంద్రబాబు కీలక ప్రకటన


 

టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే చెత్తపై పన్నును రద్దు చేస్తామని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. పది రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే వ్యక్తి జగన్ అని.. స్థానిక ఎమ్మెల్యే (స్పీకర్ తమ్మినేని సీతారాం) ఆముదాలవలసను పూర్తిగా ఊడ్చేశాడని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఆ ఇంట్లో వారికి సమర్పించుకోవాలని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

Also Read : ఎన్నికలొస్తే తెగ వినిపిస్తుంది .. అసలేంటీ ‘‘ బీ-ఫారం ’’..?

జగన్ ఒక విధ్వంసకారి అని.. రూ.13 లక్షల కోట్లు అప్పులు చేశారని .. దేశంలో ఎక్కువ అప్పులు వున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశే‌నని చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని.. ప్రతి ఎకరాకు నీరు అందిస్తామన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకొస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. వైసీపీ అరాచకాలను దేశం దృష్టికి తీసుకెళ్లాలని గుంటూరుకు చెందిన లక్ష్మీ అనే మహిళ ఢిల్లీ వెళ్లి బొటనవేలుని కట్ చేసుకుందని చంద్రబాబు తెలిపారు. చిరంజీవి, రాజమౌళి లాంటి వ్యక్తులను కూడా జగన్ అవమానించారని ఆయన మండిపడ్డారు. 

తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. రైతుల పొలాల్లోని సర్వే రాళ్లపైనా జగన్ తన ఫోటోను వేసుకుంటున్నారని.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూములు కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుగుదేశం చీఫ్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక రాయితీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలను అందజేస్తామని ఆయన వెల్లడించారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని, ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 




Comments